మరణించిన తన అన్నలను తిరిగి తీసుకువచ్చి తల్లికి చూపించిన శ్రీకృష్ణుడు



ఒకరోజు ద్వితుడు, త్రితుడు, దేవలుడు, వ్యాసుడు, కణ్వుడు, నారదుడు, గౌతముడు, చ్యవనుడు, వాల్మీకి, గార్గ్యుడు, వసిష్టుడు, గాలవుడు, అంగిరసుడు, కశ్యపుడు, అసితుడు, మార్కండేయుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, మృగుడు, శృంగుడు, అంగీరులు మొదలైన సకల మహర్షులు ద్వారకానగరానికి కృష్ణ సందర్శనార్థం వచ్చారు. వచ్చిన ఆ మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఎదురేగి, నమస్కారాలు చేసి, యథావిధిగా పూజించి వారితో మహామునిశ్రేష్ఠులారా! దేవతలకు సైతం లభించని మీ వంటి పరమ యోగీశ్వరుల దర్శనం మానవమాతృలైన మాకు ఇక్కడ లభించింది. దురదృష్టవంతులకు ఇంద్రియలోలురకు మూఢులకు మీవంటి పుణ్యాత్ముల దర్శనం, స్పర్శనం, చింతనమూ, పాదార్చనమూ దుర్లభ్యములు. అయినా ఇక్కడ మాకు అవి అతి సులభంగా ప్రాప్తించాయి. ఈ లోకంలో సాధువులు పవిత్ర తీర్థాల వంటి వారు. మిమ్మల్ని దర్శించటయే చాలు. వేరే పుణ్యతీర్ధాలు వెదకవలసిన అవసరం లేదు. అంతేకాకుండా, తీర్ధాలూ నీళ్ళతో నిండి ఉంటాయి; దేవతా ప్రతిమలు మట్టిచేత, రాతిచేత చేయబడి ఉంటాయి; అవి కూడా పరమ పవిత్రాలే అయినా వాటిని చాలాకాలం సేవించి పూజిస్తే కాని ఫలితం చేకూరదు. కానీ సత్పురుషులు తమ దర్శనం మాత్రం చేతనే పావనం చేస్తారు.


శ్రీకృష్ణుడు మాట్లాడిన మాటలు విని ఆ మునిశ్రేష్ఠులు విస్మయ హృదయులై, క్షణకాలం మౌనం వహించారు. వెనువెంటనే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొంది, చిరునవ్వు ముఖాలతో ఆయనతో ఇలా అన్నారు. “దేవా! మేము, ఉత్తమ తత్వవేత్త లైన బ్రహ్మరుద్రాదులు నీ మాయకు లోబడి ఉన్నాము. నిగూఢమైన నీ అభీష్టం మేరకు మమ్ము అనుగ్రహించావు. నీ చరిత్ర అత్యంత విచిత్రమైనది. ఈ భూమి ఒక్కటే అయిన అనేక రూపాలతో ఎలా కనపడుతుందో అలా నీవు ఒక్కడివే అయినా అనేక రూపాలతో సృష్టిస్థితిలయాలు అనే అద్భుతకార్యాన్ని చేపట్టి, లీలావతారాలు ఎత్తి, దుష్టజనశిక్షణం శిష్టజనరక్షణ చేస్తూ ఉంటావు. అంతే కాకుండా, నీవు వర్ణాశ్రమధర్మాలను అంగీకరించి విరాట్పురుషరూపంతో వేదమార్గాన్ని స్పష్టం చేసిన బ్రహ్మస్వరూపుడవు. తపస్సు ధ్యానం నియమాల చేత పరిశుద్ధం అయింది నీ హృదయం. అందుకనే బ్రహ్మస్వరూపాలైన వేదాల్లో వ్యక్తావ్యక్తమైన ఆకారంతో ఉంటున్నావు. కనుకనే, బ్రాహ్మణకులాన్నిరక్షించిన బ్రహ్మణ్యమూర్తివి; మహానుభావుడవు; మాయ అనే తెరచాటున ఉన్న నిన్ను ఈ రాజలోకమూ మేమూ దర్శించ గలిగాము; మా జన్మమూ, మా విద్యా, మా తపోమహిమా సార్ధకమయ్యాయి; నీకు నమస్కరిస్తున్నాము.” అని మునీంద్రులు బహు విధాల శ్రీకృష్ణుడిని ప్రశంసించి ఆయన వద్ద వీడ్కోలు పొంది తమతమ నివాసాలకు బయలుదేరు సమయంలో వసుదేవుడు ఆ మహర్షులకు నమస్కారం చేసి, “ఋషివరులారా! మీరు ధర్మతత్వజ్ఞులు. క్షమించి నా మనవి ఆలకించండి. సత్కర్మల ద్వారా పూర్వజన్మ కర్మలను పోగొట్టుకునే ఉపాయం నాకు దయతో తెలియ జెప్పండి.” అని ప్రార్థించాడు. అప్పుడా మునీశ్వరులు రాజులు అందరూ వింటూండగా వసుదేవునితో ఇలా అన్నారు. “ఈ శ్రీకృష్ణుడు సమస్త యజ్ఞాలకూ అధీశ్వరుడు; ఈ పుండరీకాక్షుడి గురించి చేసే యాగం వలన ఎలాంటి దుష్కర్మమైనా తొలగిపోతుంది. దీన్నే ధర్మంగా గ్రహించు. యజ్ఞాలు చేసి దేవతలఋణం; వేదాధ్యయనం చేసి ఋషిఋణం; పుత్రుని వలన పితృఋణం తీర్చుకోవాలి; ఇలా ఈ ఋణత్రయాన్ని తీర్చలేని మానవుడు పుణ్యాలకు దూరమై అధోలోకానికి పోతాడు. నీవు ఉత్తములు అయిన పుత్రుని మూలంగా పితృఋణం తీర్చుకున్నావు. వేదము చదువుట వలన ఋషిఋణము తీర్చుకున్నావు. ఇలా రెండు ఋణాలు తీర్చావు. ఇంక ఉచితమైన పని, యజ్ఞం చేసి దేవఋణాన్ని తీర్చుకోవడం. ఈవిధంగా వివరించిన మహర్షులు మాటలు విని, వసుదేవుడు వారితో ఇలా అన్నాడు. “తేజోనిధులైన ఓ మహర్షులారా! మీరు ఉపదేశించిన ప్రకారం యాగం చేస్తాను. దానిని మీరే ఋత్విజులై జరిపించాలి. అని వినయంగా వారికి మనవి చేసాడు. వసుదేవుడు ఆ మునీంద్రులను ఋత్విక్కులుగా ఎంచుకుని, శ్యమంతపంచకతీర్థం సమీపంలో దేవేంద్రుడిని మించిన వైభవంతో భార్యలు పద్దెనిమిది మందితో సమేతంగా యాగదీక్షను గైకొన్నాడు. ఆ యజ్ఞాన్ని శాస్త్రప్రకారం పూర్తిచేసాడు. ఋత్విక్కులను అనేక దక్షిణలతో సంతృప్తి పరిచాడు. భార్యలతో కలిసి అవభృథస్నానం చేసాడు. పిమ్మట, వివిధ మణిమయ భూషణాలు, నూతనవస్త్రాలు, పరిమళభరితమైన పూలదండలు, మనోహరమైన మైపూతలు ధరించాడు. బ్రాహ్మణులనూ మునులనూ బంధువులనూ రాజసమూహాన్నీ సముచిత సత్కారాలతో సంతోషింప చేసాడు. వారు కూడా శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని తమతమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. ఉగ్రసేన మహారాజు బలరామ కృష్ణులూ నందుడు యశోదా గోపగోపికలతోసహాఅక్కడే కొన్నాళ్లు ఉండమని వేడుకొన్నారు. వారి మాట మన్నించి కొన్నాళ్ళుపాటు తృప్తిగా అక్కడే ఉన్నారు. విధంగా శ్రీకృష్ణుని మంచితనాన్నీ, మర్యాదనూ, మాటల మాధుర్యాన్నీ, హరి మనోహరమైన లీలావిలాసాలు వింటూ నందుడు మూడునెలలు అక్కడనే ఉన్నాడు. తరువాత పద్మాక్షుడు శ్రీకృష్ణుడు తక్కిన యాదవ ప్రముఖులు అందరు నందుడికి అతడి పరివారానికి తగిన ఆభరణాలు వస్త్రాలు సర్వం బహుకరించి వీడ్కోలు పలికారు. ముకుందుడిని వదిలి వెళ్లలేక బలవంతంగా మరలించుకుని నందుడు మొదలైనవారు ప్రయాణం సాగించారు. కృష్ణ! మాధవ! గోవింద! పద్మనాభ! భక్తపారిజాతమా! దేవాధిదేవా! అనుకుంటూ శ్రీకృష్ణనామాలు జపిస్తూ మాటిమాటికీ వెనుతిరిగి చూస్తూ, పోలేక పోలేక నందుడూ అతని అనుచరులూ మధురానగరం వైపు సాగిపోయారు. కొంతకాలం తరువాత ఇంతక్రితం బలరామకృష్ణులు సముద్రంలో పడిపోయిన తమ గురుపుత్రుడిని మళ్ళీ తెచ్చి ఇచ్చిన విషయం ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండగా, వసుదేవుడి భార్య దేవకీదేవి విన్నది. కంసునిచేత వధింపబడి యముని సదనంలో ఉన్న తన బిడ్డలను చూడాలని అమె మనసులో కోరిక బలపడింది. అమె బలరామ కృష్ణుల దగ్గరకు వెళ్ళి కన్నీరు కారుస్తూ “ఓ బలరామా! ఓ కృష్ణా! మీరు పాపాత్ములైన కంసుడు, చేదిదేశపు శిశుపాలుడు, మురాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, నరకాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు మున్నగు దుష్ట రాజులను సంహరించి భూభారాన్ని బాపిన మహా బలవంతులు.” అని దేవకీదేవి బలరామ కృష్ణులను ప్రశంసించి, “మీరు తలచుకుంటే మీరు సృష్టి స్థితి లయాలు జరిపే పరమపురుషులు. అవన్నీ మీ లీలావిలాసాలు. నేను మిమ్మల్ని నమ్మిన దానిని. నా కోరిక వినండి నాయనలారా!” అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. “మహానుభావులారా! మీరు చాలా కాలం క్రితం మృతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ళ పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి.” ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్ళారు. అప్పుడు సుతలలోక నివాసి ఐన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి శ్రీకృష్ణ బాలరాముడు వస్తుండగా చూసాడు. బలిచక్రవర్తి తన ఆప్తులతో బలరామ కృష్ణుల కెదురు వచ్చి అత్యంతానురాగంతో వారికి స్వాగతం పలికి, పాదాభివందనాలు చేసాడు. వారిని సువర్ణపీఠాలపై ఆసీనులను చేసి వారి పాదాలు కడిగి పాదజలాన్ని భక్తితో తల మీద చల్లుకున్నాడు. నా పాపం అంతరించింది; సంసారసాగరం దాటగలిగాను; ముక్తిసాధనం చూడగలిగాను; నీ కరుణాదృష్టికి పాత్రుడనయ్యాను; పరమశివుడు, బ్రహ్మదేవుడు సైతం కానరాని మహాత్మా! నీవు నా గృహానికి విచ్చేశావు. నేను ధన్యుడిని అయ్యాను. భగవాన్! నేను నీ దాసుడిని; నీ అజ్ఞకు బద్ధుడిని; మీరిక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పండి.” అని బలిచక్రవర్తి చేతులు జోడించి భక్తితో విన్నవించాడు. కృష్ణుడు సంతోషించి అతనితో ఇలా అన్నాడు. పూర్వం ఆదియుగంలో మరీచి అనువానికి భార్య వర్ష యందు ఆరుగురు పుత్రులు పుట్టారు. ఒకనాడు బ్రహ్మదేవుడిని అపహాస్యం చేసారు. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా పుట్టండని శపించాడు. ఆ శాప కారణంగా వారు హిరణ్యకశిపుడికి కొడుకులుగా పుట్టారు. తరువాత దేవతల హితంకోరి యోగమాయ వారిని దేవకిగర్భం లోనికి ప్రవేశింపజేసింది. దేవకీదేవి గర్భాన వారు ప్రసవించారు. పట్టుబట్టి కంసుడు ఆ శిశువులను చంపివేశాడు. ఇప్పుడు దేవకీదేవి పుత్రశోకంతో కుమిలి వారిని చూడాలని కోరి పంపగా మేము ఇచ్చటకి వచ్చాము. పుణ్యాత్మా! ఆమెకు వారిని మరల తీసుకువస్తా మని మాట ఇచ్చి ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర సుఖంగా ఉన్న వీరే ఆమె పుత్రులు. వీరిని తీసుకు వెళ్ళి భూలోకంలోఉన్న మా తల్లి శోకాన్నిపోగొడతాము. అంతటితో వీరు శాపవిముక్తులు కాగలరు; మా అనుగ్రహం వలన దివ్యజ్ఞానం కలవారు కాగలరు. తరువాత నా అనుగ్రహం వలన వీరికి సుగతి ప్రాప్తిస్తుంది.” ఈవిధంగా పలికి కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతి పొంది భూలోకానికి దేవకీతనయులను తమ కూడా తీసుకుని వచ్చాడు. ఆరుగురు శిశువులను తీసుకుని వచ్చి తల్లి దేవకీదేవితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. అమ్మా! ఇరిగో వీరే నీ బిడ్డలు చూడు” అంటూ ఆ బాలకులను తల్లి దేవకీదేవి ముందుకు తెచ్చాడు. ఆమెలో పుత్రవాత్సల్యం పొంగిపొరలింది. వారిని కౌగలించుకుని “నా కన్నబిడ్డలు వచ్చారు,” అని లాలించింది. అలా లాలించి, తన చిన్నారి తనయులను దేవకీదేవి ఆలింగనం చేసుకుని, ఒడిలో కూర్చోబెట్టుకుంది. వారి నడినెత్తిన ముద్దిడింది, గడ్డం పుణికింది. పెల్లుబికిన ప్రేమతో ఆమె దేహం పులకలెత్తంది. వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ మాయా ప్రభావానికి వశులై తల్లిపాలు త్రాగారు. శ్రీకృష్ణుని స్పర్శవలన నిర్మలులు అయ్యారు. శ్రీహరి దయ అనే పడవ సహాయంతో బ్రహ్మశాపం అనే సాగరాన్ని దాటి స్వస్వరూపాలు ధరించి తమ తమ స్థానాలు చేరుకున్నారు. అంతట దేవకీదేవి తన మనసులో అచ్చెరువొందింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...